శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు. దేశమంతా హైదరాబాద్ వైపు చూసేలా సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించనుంది. దేశంలోని కొన్ని చిన్న రాష్ట్రాల కంటే అతిపెద్ద నగరంగా ఆవిర్భవించనుంది. పక్కా ప్రణాళిక, పర్ఫెక్ట్ విజన్‌తో ముందుకువెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రపంచదేశాలతో పోటీ పడేలా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం మొదలు పెట్టారు. అంతకంటే ముందు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్‌కు మరింత ఇంధనం పోస్తూ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ మహానగరం అవతరించనుంది. మొత్తం 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంతో నగర జనాభా 2 కోట్లకు చేరుకోనుంది. దీంతో నగర శివార్లలో అభివృద్ధి మరింత వేగవంతం కానుంది.

సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం చాలా ముందు చూపుతో తీసుకున్నది. తెలంగాణను కోర్ అర్బన్, సెమీ అర్బన్(గ్రోత్ కారిడార్), రూరల్ ఏరియాగా విభజిస్తూ అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలని చాలా రోజులుగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్సులను పూర్తిగా ఎలక్ట్రిక్‌గా మార్చాలని, డీజిల్ ఆటోలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి పంపిస్తామని ముందునుంచి చెప్తూనే ఉన్నారు. మరోవైపు రీజనల్ రింగ్‌రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు మధ్యన ఉన్న ప్రాంతాన్ని ఇండస్ట్రీయల్ జోన్‌గా డెవలప్ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విలీన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి ఈ నిర్ణయం మరింత ఊతం ఇవ్వనుంది.