Site icon Polytricks.in

నేతల్ని వాడుకొని వదిలేయడం కేసీఆర్ నైజమా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశవాద రాజకీయాలపై ఆ పార్టీ నేతల్లో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది. కేసీఆర్ ను నమ్మి పార్టీలో చేరితే ఇప్పుడు పట్టించుకునే నాథుడే లేడని తెగ ఫీల్ అవుతున్నారు. బీజేపీ పట్టించుకోవడం లేదని కమలాన్ని వదిలేసి కారెక్కితే… డ్రైవర్ పట్టించుకోవడం లేదని అసంతృప్తితో రగిలిపోతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు హైప్ తీసుకొచ్చేందుకు మాత్రమే తమను కారెక్కించారని మధనపడుతున్నారు. పార్టీలో చేరిన సమయంలో తగిన ప్రాధాన్యత ఉంటుందని చెప్తే ఆనందంతో ఊహల్లో తెలియాడిన నేతలు ఇప్పుడు కేసీఆర్ కరుణ కోసం వెయిట్ చేస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్యను బీజేపీలో చేర్చుకోవడంతో బీజేపీకి పుంజుకుంటుందని జనాల్లోకి సందేశాన్ని ఆ పార్టీ నేతలు తీసుకెళ్ళారు. రాజకీయాల్లో తనదైన వ్యూహాలను అమలు చేసే కేసీఆర్ బీజేపీకి దీటుగా ఆ పార్టీలో ఉన్న స్వామిగౌడ్, భిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రావణ్, పల్లె రవిలను తిరిగి బీఆర్ఎస్ లో చేర్చుకొని కమలదళానికి గట్టి షాక్ ఇచ్చారు. వారు పార్టీలో చేరిన సమయంలో వారిని కేసీఆర్ గౌరవించిన తీరు చూసి నలుగురు నేతలు సంబురపడ్డారు. పదవులు ఖాయమని అనుకున్నారు. కాని ఇంతవరకు వారిని పట్టించుకునే నాథుడే లేడు.

త్వరలో అసెంబ్లీ కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి షెడ్యూల్ రానుంది. దాంతో వారిలో ఎవరికి ఏ పదవి ఇస్తారోనన్న ఆసక్తి నెలకొంది. ఇందులో ఎవరికి ఎమ్మెల్సీ పదవి దక్కుతుంది? ఎవరికి నామినేటెడ్ పదవి ఇస్తారన్నది తెలియాల్సి ఉంది. కేసీఆర్ కరుణ కోసం ఇప్పుడు వీరంతా ఎదురుచూస్తున్నారు. వీరిలో ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవులు ఆఫర్ చేసి బీఆర్ఎస్ లో చేర్చుకున్నారన్న వాదనలు ఉండటంతో.. కేసీఆర్ ఇచ్చిన హామీని నేరవేర్చుతారా..? లేదా తన నైజంను మరోసారి చూపిస్తారో చూడాలి.

Also Read : కేసీఆర్ రాజకీయానికి స్వామి గౌడ్, దాసోజులు మళ్ళీ బలైనట్లేనా..?

Exit mobile version