Site icon Polytricks.in

బీఆర్ఎస్ కు ఎంత ఖర్మ పట్టిందిరా బాబు…!!

తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ అగ్రనేతల త్రయం సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు ప్రకటించిన ఆరు గ్యారంటీలు బీఆర్ఎస్ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్టు ఉన్నాయి. అతిశయోక్తి అనిపించినా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో లీకులు చూస్తుంటే నిజమేనని అనిపించక మానదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల తర్వాత కాంగ్రెస్ తిరుగులేని ఆధిపత్యం చాటుతోంది. దాదాపు అన్ని సర్వేలూ కాంగ్రెస్ కు ఎడ్జ్ ఉందని తెల్చుతున్నాయి. ఒకటి రెండు సర్వేలో కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో మాత్రమే కాంగ్రెస్ వెనుకంజలో ఉందని తేల్చుతున్నాయి. ఆరు గ్యారంటీలు బాగున్నాయని 52శాతం మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమలు కూడా చేస్తుందని 48శాతం మంది కాంగ్రెస్ పై విశ్వాసం ఉంచారు. దీంతో బీఆర్ఎస్ లో అలజడి ప్రారంభమైంది.

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు ధీటుగా హామీలు ఇవ్వాలని బీఆర్ఎస్ అన్వేషణ మొదలు పెట్టింది. ప్రొఫెసర్లు, రాజకీయ మేధావులు, నిపుణులతో చర్చించింది. చివరికి తేల్చింది ఏంటంటే…కాంగ్రెస్ పథకాలు కాపీ కొట్టడమే. అవును..కాంగ్రెస్ పథకాలకు వస్తోన్న ఆదరణతో నిర్ణయం తీసుకున్నారో …ఆ హామీలను అమలు చేయడం ఏమంత కష్టం కాదనుకున్నారో కానీ.. దాదాపు మూడు కాంగ్రెస్ పథకాలను కాపీ కొట్టనున్నట్లు తెలుస్తోంది.

అవి ఏంటంటే…ఒకటి కాంగ్రెస్ మహాలక్ష్మీ పథకం పేరు మార్చి బీఆర్ఎస్ మహిళా బంధు ఇవ్వడం…కాంగ్రెస్ 500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీని బీఆర్ఎస్ సబ్సిడీ ద్వారా అందిస్తుందని ప్రకటించడం. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని కాంగ్రెస్ హామీ ఇస్తే.. బీఆర్ఎస్ దీనినే మరో పేరుతో ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చనుంది. ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ రూ.12లక్షలు ఇస్తామని హామీతో..దళిత బంధుతోపాటు గిరిజన బంధు కూడా ఇస్తామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో చేర్చనున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి కాంగ్రెస్ పథకాలు సాధ్యం కావని చెబుతూనే.. ఇంచు మించుగా కొన్ని అవే తరహా హామీలను బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చనుండటం కొసమెరుపు.

Exit mobile version