Site icon Polytricks.in

కొత్త చరిత్రను లిఖిస్తోన్న బలగం సినిమా

ఏళ్లకు ఏళ్లుగా విడిపోయిన వారిని బలగం సినిమా ఏకం చేస్తోంది. మనుషుల మధ్య ఏర్పడిన దూరాన్ని తగ్గించేస్తు కొత్త చరిత్రను లిఖిస్తోంది. ప్రతి వారితో కన్నీరు పెట్టిస్తు పెరిగిపోయిన ఎడబాటును పూడ్చివేస్తోంది బలగం సినిమా. సినిమా చూసి హీరోయిజం ప్రదర్శించేవాళ్ళను, కామెడి చేసే వాళ్ళను చూసాం కానీ, తెగిపోయిన బంధాలను తిరిగి వెతుక్కుంటున్న స్థితిని బలగం సినిమా కల్పించింది.

బలగం సినిమాను గ్రామాల్లో సర్పంచ్ లు, గ్రామ యువత ముందుకు వచ్చి విశాలమైన ప్రాంతాల్లో స్క్రీనింగ్ చేస్తున్నారు. తెలంగాణలోని పలు గ్రామాల్లో ఈ సినిమాను ప్రదర్శించడం జరిగింది. సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ గతంలో విడిపోయిన బంధువులు కలిసిపోతున్న సంఘటనలు చాలానే ఉంటున్నాయి.

ఇటీవల భూ వివాదం తలెత్తడంతో అన్నదమ్ములు మాట్లాడుకోవడం మానేశారు. కానీ ఈ బలగం సినిమా చూస్తూ ఒక్కటి అయ్యారు. సినిమా ప్రదర్శిస్తోన్న సమయంలో అన్నదమ్ములు ఇద్దరు అక్కడే ఉండటంతో మేము కలిసిపోతామని ముందుకు వచ్చారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది.

వనపర్తి జిల్లా వనపర్తి మండలం పరిధిలో ఇటీవల గ్రామ పంచాయితీ కార్యాలయంలో బలగం సినిమాను ప్రదర్శించడం జరిగింది. ఆ సినిమాకు హాజరు అయిన లింగారెడ్డి, లక్ష్మీ లు అక్కా తమ్ముడు. వీరు 15 ఏళ్ల క్రితం నుంచి మాట్లాడుకోవడం లేదు. లింగారెడ్డి కూతురు పెళ్లిలో లక్ష్మీ ని ఫొటో దించలేదట. దాంతో లక్ష్మీ 15 ఏళ్లుగా సొంత తమ్ముడికి దూరంగా ఉంటుంది.

లక్ష్మీ భర్త చనిపోయిన సమయంలోనూ లింగారెడ్డి కుటుంబం కలవలేదు. కాని బలగం సినిమా మాత్రం వీళ్ళను ఏకం చేసింది. సినిమా ఆఖరి పాటను చూస్తూ మేము కలిసిపోతామని ముందుకు వచ్చారు. అక్కా, తమ్ముడు ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ కనిపించారు. అందర్నీ కంటతడి పెట్టించింది ఈ సీన్.

Exit mobile version