జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని వర్గాలు ఒక్కతాటిపైకి వస్తున్నాయి. కాంగ్రెస్ అభివృద్ధికి జై కొడుతున్నాయి. దీంతో రహస్య మిత్రులు బీఆర్ఎస్, బీజేపీలకు వణుకు పుడుతోంది. అందుకే ప్రతి పనికి అడ్డుపడుతున్నాయి. తాజాగా అజారుద్దీన్‌కు మంత్రిపదవి విషయంలో బీజేపీ చేసిన పని అందుకు నిదర్శనం. తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్ తీసుకుంటున్నట్లు వార్తలు రాగానే…బీజేపీ ఉలిక్కిపడింది. ప్రతి అంశాన్ని కులం, మతం అంటూ లింక్ పెడుతూ అభివృధ్ధికి ఆటంకంగా మారుతోంది. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎన్నికల సంఘానికి లేఖ రాయడం ఆ పార్టీ సంకుచిత స్వభావాన్ని తెలియజేస్తున్నది.
అజారుద్దీన్ ముస్లిం నేత కాబట్టి జూబ్లీహిల్స్‌లో ముస్లింలను ఆకట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని మాట్లాడటం బీజేపీ నీచ రాజకీయాలకు నిదర్శనం. జూబ్లీహిల్స్ అభివృద్ధిపై కాంగ్రెస్ మాట్లాడుతుంటే…బీజేపీ మాత్రం కులాలు, మతాలు అంటూ తన మార్కు రాజకీయాలు చేస్తోంది. నిజానికి అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి సిద్దాంతం అందుకే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై చిత్తశుద్దితో పనిచేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసాన్ని చేసి కులగణనను వందశాతం సక్సెస్‌ఫుల్‌గా చేశారు. బీజేపీ మాదిరిగా సంకుచితంగా ఆలోచించకుండా అన్ని వర్గాలకు సమానన్యాయం అందాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేసిన పనిని ఆదర్శంగా తీసుకొని త్వరలోనే దేశంలో కూడా కులగణన చేయాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణ కులగణనపై అడ్డగోలుగా మాట్లాడిన బీజేపీ నేతలు..ఇప్పుడు తమ స్టాండ్ చెప్పడం లేదు. తెలంగాణలో పేద ముస్లీంలను బీసీల్లో కలిపి గణన చేయడంపై అభ్యంతరం చెప్పిన బీజేపీ నాయకులు…కేంద్రం జరిపే జనాభా గణనలో కులగణన విషయంలో ఏం చేస్తుంది. పేద ముస్లింలను బీసీల్లో చేర్చి కులగణన చేస్తారా? లేకపోతే వేరే ఆప్షన్ పెడతారా?. అసలు పేద ముస్లింలను లెక్కిస్తారా? అనే విషయం స్పష్టం చేయాలి. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బీజేపీ తన స్టాండ్ చెప్పకుండా…పేద ముస్లీంలను బీసీల్లో కలిపి లెక్కించారని సాకులు చెబుతోంది. రాబోయే సంవత్సరంలో జాతీయ స్థాయిలో జరిగే కులగణన విషయంపై మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతోంది.
ఎన్నికల కోసం ఒక వర్గాన్ని రెచ్చగొట్టడం బీజేపీకి మాత్రమే వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ కూడా అదే కోవలో చేరింది. కానీ కాంగ్రెస్ మాత్రం అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలనే తపనతో, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో పనిచేస్తోంది.

