Site icon Polytricks.in

వచ్చే ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ కు టికెట్ కష్టమే..!

మంత్రి పదవిని కోల్పోయాక వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను ఎవరూ పట్టించుకోవడం లేదు. సొంత పార్టీ నేతలు కూడా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వైసీపీ నేతలే ఆయనకు వ్యతిరేకంగా జట్టు కడుతున్న పరిస్థితి నెలకొంది.

2019 ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప తేడాతో నెల్లూరు నుంచి నారాయ‌ణ పై గెలిచారు అనిల్ కుమార్ యాదవ్. పిన్న వయస్సులోనే జగన్ దృష్టిని ఆకర్షించి మంత్రి అయ్యారు. ఆ తరువాత జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్విప్ చేయడంలో అనిల్ కుమార్ యాదవ్ పాత్ర ఉంది. కాని కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఇప్పుడు ఆ కార్పొరేటర్లు అనిల్ కుమార్ యాదవ్ కు అడ్డం తిరిగారు. మంత్రి పదవి పోయిన తరువాత ఆయన్ను పట్టించుకోవడం మానేశారు.

అనిల్ కుమార్ వ్యతిరేక వర్గమంత ఆయన బాబాయ్ రూప్ కుమార్ చెంతకు చేరింది. మొన్నటివరకు అనిల్ యాద‌వ్ తో ఉన్న నేతలు ఆయన బాబాయ్ వద్దకు వెళ్ళారు. ఆయన వేరుకుంపటి పెట్టుకున్నారు. తనను ఎవరూ వదిలిపోయినా పరవాలేదని.. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తానని అనిల్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఒక్క రూప్ కుమార్ తోనే సమస్య కాదు. జిల్లా నేతలందరితోనూ సమస్యే.

నెల్లూరు జిల్లాలో ఒక్క నాయకుడితోనూ అనిల్ కుమార్ యాదవ్ కు సఖ్యత లేదు. ఆనం రాంనారాయణ రెడ్డితో విబేధాలు ఉండగా.. మంత్రి కాకాణితోనూ పొసగడం లేదు. జిల్లాలో ఆయన ఒంటరిగా మారిపోతున్నారు. అందుకే ఆయనను పార్టీ సమావేశాలకు కూడా ఆహ్వానించడం లేదు. ఇటీవల ఆర్యవైశ్య సమావేశం ఏర్పాటు చేస్తే ఆయనను పిలువలేదు. దాంతో ఆ మీటింగ్ కు వెళ్లిన వాళ్లంతా వెయిట్ ఉన్న వాళ్లని తనకు అంత వెయిట్ లేదని నిష్టూరుమారుడుకున్నారు.

మొత్తంగా అనిల్ కుమార్.. అందరికీ దూరమై అసహనానికి గురవుతున్నారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దొరకడం కష్టమన్న వాదన కూడా వినిపిస్తోంది.

Exit mobile version