Site icon Polytricks.in

క్యాబినెట్ నుంచి నలుగురు అవుట్ – మరి జగన్ సంగతేంటి..?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ప్రతికూల ఫలితాలు రావడంతో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫలితాలకు ఆయా జిల్లాలకు చెందిన మంత్రులను బాధ్యులను చేస్తూ వారిపై వేటు వేయనున్నట్లు సమాచారం. ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో ఈ ఫలితాలు జగన్ కు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయని దాంతో ఆయన నలుగురు మంత్రులను తప్పించనున్నారనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది.

సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్‌ల పదవులకు గండం పొంచి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో అన్ని స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేయగా..మూడు పట్టభద్రుల స్థానాల్లో వైసీపీ ఓటమి పాలైంది. ఇక.. తమకు తిరుగు ఉండదని భావించిన పశ్చిమ రాయలసీమలోని ఫలితాలు కూడా వైసీపీని కుంగదీస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలపై పోర్ట్ మార్టం నిర్వహించిన అనంతరం ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం మంత్రుల్ని సాగనంపవచ్చని చెబుతున్నారు.

వైసీపీపై ఆదరణ ఉందని జగన్ ఓ వైపు గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఇందుకు విరుద్దమైన ఫలితాలు వచ్చాయి. ఉద్యోగులు, నిరుద్యోగుల విషయంలో జగన్ వారికి లబ్ది చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటే ఈ ఫలితాలు ఎందుకు వచ్చి ఉండేవన్నది వైసీపీ నుంచే వినిపిస్తోన్న ప్రశ్నలు. పట్టభద్రుల ఎన్నికల ఫలితాలకు మంత్రులను బాధ్యులను చేయడం మానేసి..పరిపాలనపై సరిగా దృష్టి పెడితే బాగుంటుందని సూచిస్తున్నారు.

అయితే సీఎం జగన్ నియోజకవర్గం పులివెందులలో కూడా పట్టభద్రుల ఓటర్లు వైసీపీకి ఓటేయలేదు. మరి ఆయన రాజీనామా చేస్తారా అనే సెటైర్లు ఆ పార్టీలో వినిపిస్తున్నాయి.

Also  Read : పులివెందులలో వైసీపీకి ప్రమాదఘంటికలు..!

Exit mobile version